సత్యనారాయణ వ్రతం

సత్యనారాయణ వ్రతం

సత్యనారాయణ వ్రత ప్రారంభం:

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి,అలికి,బియ్యపు పిండితోగాని,రంగుల చూర్ణములతోగాని,ముగ్గులుపెట్టి,దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగాని, మరీ పల్లముగానీ ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపతమునుగాని, ఆ పీట పై ఉంచాలి.ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్లెంలోగాని, క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి,అందు పసుపు గణపతినుంచి అగరువత్తులు వెలిగించాలి.ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి.దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

దీపారాధనకు కావలసిన వస్తువులు – దీపారాధన విధానము :-

దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిదిగాని, మట్టిది గాని వాడవచ్చును.కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభవత్తి (మధ్యలో)వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు)వేసి ముందుగా ఏకహరతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి వెలిగించవలెను.తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను.కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వులనూనెగాని, కొబ్బరినూనెగాని, ఆవునెయ్యి గాని వాడవచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒకగ్లాసుగాని,చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.

ఈ వ్రతమునకు కావలసిన వస్తువులు:

శ్రీ నత్యనారాయణ స్వామివారి ప్రతిమ లేదా చిత్రపటము బియ్యము, చూర్ణము, పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకలు, లవంగములు, ఏలకులు మొదలగు సుగంధ ద్రవ్యములు. ఖర్జూర ఫలములు, ద్రాక్షఫలములు, కిస్ మిస్ ఫలములు, ధూపమునకు సాంబ్రాణి, కొబ్బరికాయలు, పళ్ళు, పువ్వులు, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె, అగరువత్తులు, వస్త్ర, యజ్ఞోపవీతములు మరియు పంచామృతాలు (ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార) గోధుమనూక, పాలు, కలశము, నూతనవస్త్రములు, రవికెలగుడ్డ, మామిడాకులు మొదలైనవి.మంటపారాధనకు నూతన వస్త్రములు, అగరువత్తులు, స్వామికి సువాసన ద్రవ్యములు, మంచి గంధము మొదలగునవి వ్రతము చేయుటకు ముందుగా సేకరించి యుంచుకొనవలెను. నూతన వస్త్రములతోను, దక్షిణ తాంబూలములతోను, పురోహితులను సంతుష్టి గావింపవలెను, యధాశక్తిగా వ్రతము ఆచరించవలయును. లోభత్వము కూడదు. భక్తి శ్రద్ధలు ప్రదానము.

శ్రీ సత్యనారాయణ వ్రతము ఎక్కడ? ఎప్పుడు? ఎట్లు చేయవలెను?

ప్రతిమాసమునందును, రవి సంక్రమణ దినమునందుగాని, పౌర్ణమి తిథి యందుగాని, ఏకాదశి యందుగాని, ఏదైనా ఒక శుభదినమున సాయంకాలమున గాని, ఉదయమున గాని, స్నానముచేసి శుచియై సంధ్యావందనాది నిత్యకర్మలను యధావిధిగా ఆచరించి, బ్రాహ్మణులను, బంధుమిత్రాదులను రప్పించి, శుభకరములైన మంగళ వాయిద్యములతోడను, మంగళకరములైన స్వస్తి వాచకములతోడను, వేద పటణముల తోడను, దేవాలయమునగాని, పుణ్య క్షేత్రముల యందుగాని, సముద్రతీరమున గాని, నదీతీరమునగాని, వనమందు గాని, స్వగృహమున గాని శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించవలయును. పూజా స్థలమును గోమయముచే శుద్ధి చేసి, తూర్పుగా బియ్యం, చూర్ణము, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి, మంటపము గావించి, మామిడాకుల తోరణములతో సుందరముగా అలంకరించి పూజాద్రవ్యములు రాగిపాత్ర నూతనవస్త్రములు, కొబ్బరికాయ, పూజాస్థలము నందుంచి భక్తితో దీపారాధన జేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తిశ్రద్ధలతో ఆచరించవలెను. భక్తిలోపము కారాదు. లోభము కూడదు. యధాశక్తి ఆచరించిన విశేష పుణ్యఫలము లభించును. భక్తి శ్రద్ధలు ప్రధానము.

పూజావిధానము:

కలశపూజ ,మార్జనము చేసి గణపతి ని తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ఠ అనగా శ్రీ మహా గణాధి పతయేనమః ప్రాణ ప్రతిష్టా పన ముహూర్తస్సు ముహూర్తోస్తు తధాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో || శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నో పశాంతయే ||
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః
షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||

పంచలోక పూజ చేసి తరువాత నగ్రహములను పూజించవలెను.తరువాత అష్ట దిక్పాలకులను పూజించవలెను.

పిదప సత్యనారాయణ ప్రతిమను తమలపాకున ఉంచి  పంచామృతములతో శోధనము చేయవలెను. ధ్యాన ఆవాహనాదులను చేసి  అంగపూజనూ సత్యనారాయణ స్వామి అష్టోతరాన్ని లేదా సహస్ర నామాలని చదివి, పునః పూజను చేసి వ్రత కథలను ప్రారంభించాలి.