వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం అత్యంత విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా చెప్పబడుతున్న నెల. ఈ మాసంలో పన్నమినాడు శ్రవణా నక్షత్రం కూడినందువల్ల శ్రావణమాసంగా పిలువబడుతున్నది. స్త్రీలకు సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే నాగుల చవితి, గరుడ పంచమి, మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీవ్రతం మున్నగు నోములు, ప్రతాలు ఒనగూడిన నెల శ్రావణమాసం! అందువల్లే స్త్రీలకు అత్యంత ప్రాముఖ్యం కలిగిన నెలగా శ్రావణమాసం ఆచరింపబడుతున్నది. ప్రధానంగా కొత్తగా వివాహమైన నూతన వధువులు తమ తమ సౌభాగ్యశ్రేయస్సుల కోసం శ్రావణమాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ఇలా ఈ నెలలో నాలుగు లేదా ఐదు వారాలుగా వచ్చే ప్రతి మంగళవారంనాడు మంగళగౌరీవ్రతాలతో పాటు అదే శ్రావణమాసంలో పన్నమినాటికి ముందు వచ్చే శుక్రవారంనాడు సకల సిరిసంపదలను కురిపించే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని కూడ ఆచరిస్తారు. నూతన వధువులు మాత్రమే గాక ఇతర పుణ్యస్త్రీలు కూడా ఈ వరలక్ష్మీవ్రతాన్ని తమ ఇంటిలో తప్పక ఆచరిస్తారు. ఇలా ఇంటిల్లిపాదీ శుభప్రదంగా జరుపుకునే వ్రతం శ్రీ వరలక్ష్మీవ్రతం